అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమర్ చంద్రబాబు నాయుడు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రమేష్ కుమార్ మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు హాని ఉందంటూ ఎన్నికల కమిషనర్ రమేష్ కేంద్రానికి లేఖ రాయడం వెనుక ఉద్దేమేంటని ప్రశ్నించారు. లేఖలోని అంశాలను చూశాక రమేషే రాశారన్న అనుమానం కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు లేఖ రాసినట్లు ఉందని ఆరోపించారు. ఈ నెల 15వ తేదిన నిమ్మగడ్డ చెప్పిన మాటలకు.. లేఖలో రాసిన అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు.
రమేష్ కుమార్ లేఖ వెనుక ఉద్దేశం ఏంటి?